కృష్ణవేణి వికాస్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు,సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.
అర్జున్ సమాచారం// అక్టోబర్ 9// గోదావరిఖని.
గోదావరిఖని, అక్టోబర్ 9: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను గోదావరిఖని మార్కండేయ కాలనీలోని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు, జానపద గీతాలు, చప్పట్లతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
కళాశాల చైర్మన్ డాక్టర్ నాగండ్ల రవికుమార్, డైరెక్టర్ నాగండ్ల జమున, ప్రిన్సిపల్ ఎం. వెంకన్న, వైస్ ప్రిన్సిపల్ ఆర్. నరసింహారావు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి విద్యార్థినులు సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సంస్కృతి వైభవానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలపై అవగాహన కల్పించడం విద్యాసంస్థల బాధ్యతని పేర్కొన్నారు. యువతరం తమ మూలాలను మరచిపోకుండా తెలంగాణ వారసత్వాన్ని కాపాడాలని సూచించారు.
డైరెక్టర్ జమున మాట్లాడుతూ, విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. అనంతరం బతుకమ్మలను సంప్రదాయబద్ధంగా సాగనంపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.